వివేకంతో తీస్తే ‘AD’.. లేకుండా తీస్తే ‘AV’?

గతంలో దాసరి, కె.విశ్వనాధ్‌, వంశీ వంటి వారికి, రాఘవేంద్రరావుకి కూడా ఫ్లాప్‌లున్నాయి. ఏ సినిమా ఎందుకు? ఎప్పుడు ఆడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. దీనికి ఇటీవల బన్నీ సాధిస్తున్న వరుస విజయాలు, సాధారణ చిత్రాలు కూడా బ్లాక్‌బస్టర్స్‌గా నిలుస్తూ, విశ్లేషకులను కూడా ఆశ్యర్యంలో ముంచెత్తుతున్నాయి. కాబట్టి తప్పుగా చిత్రం తీసి ఫ్లాప్‌ అయితే ఫర్వాలేదు తప్పులు సహజమే. కానీ నిర్లక్ష్యం తలకెక్కితే మాత్రం దానిని తల నుంచి దించడం ఎవ్వరి వల్లాకాదు. ఆ కాలంలో దర్శకనిర్మాతలు, హీరోలు కూడా రియల్‌ క్రిటిక్స్‌ ఉండేవారు. నాటి దర్శకులు తమ చిత్రాలలోని తప్పులను తెలుసుకుని నేర్చుకునే వారు. కానీ నేడు రెండు మూడు హిట్టులు వస్తే తాము తీసిందే సినిమా.. తాము పాడిందే పాట.. తాము రాసిందే డైలాగ్‌ అనే భ్రమలో ఉంటున్నారు.

ఇక ‘అజ్ఞాతవాసి’ చూస్తే ప్రతి సన్నివేశంలో త్రివిక్రమ్‌ నిర్లక్ష్య ధోరణి బాగా కనిపిస్తోంది. అసలు ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేశాడా? ‘సర్దార్‌గబ్బర్‌సింగ్‌, కాటమరాయుడు’ లాగా పవనే డైరెక్ట్‌ చేశాడా? అనే అనుమానం వస్తోంది. త్రివిక్రమ్‌ నుంచి ఇంత నాసిరకమైన చిత్రం గతంలో రాలేదనే చెప్పాలి. ఆయన తన మ్యాజిక్‌ని ఒక్క సీన్‌లో కూడా చూపించలేకపోయాడు. తాను రాస్తున్న డైలాగ్స్‌ విషయంలో స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన అసలు జాగ్రత్తలే తీసుకోలేదనిపిస్తుంది. ఇక ఓ కాపీ చిత్రంలో కూడా తనదైన ముద్రను త్రివిక్రమ్‌ వేయలేకపోయాడు. స్క్రీన్‌ప్లే నాసిరకం. ఇక ఐదు నిమిషాలు సుదీర్ఘంగా సాగే బెల్ట్‌తో కొట్టే సీన్‌ ప్రేక్షకుల సహనానికి పరీక్ష.

‘అత్తారింటికి దారేది’ చిత్రంలో బ్రహ్మానందం, పవన్‌ల మధ్య వచ్చే నాటకం ఎపిసోడ్‌లా ఇది పేలుతుందని భావించాడు. ఇక పవన్‌ చేత అల్లరిచిల్లర పనులు చేయించడం, ఆడ గొంతుతో మాట్లాడించడం వంటి వన్నీ ఓవర్‌. ఇక హీరోయిన్లు ఇద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకునే దిగజారిన సీన్‌ త్రివిక్రమ్‌ ఎలా తీశాడో తెలీదు. మొదటి నుంచి త్రివిక్రమ్‌ చిత్రాలలో మాటల రచయిత డైరెక్టర్‌ని డామినేట్‌ చేస్తుంటాడు. ఈ విషయం ‘నువ్వే..నువ్వే’నుంచి జరుగుతూనే ఉంది. ఆ మాటల మ్యాజికే ఆయనకు ఇప్పటివరకు ప్లస్‌ అయింది. ఈ చిత్రం చూస్తే రచయితగా కూడా ఆయన ఫెయిల్‌ అయ్యాడు. ఆయన తీసిన చిత్రాలలో మహేష్‌ నటించిన ‘ఖలేజా’ చిత్రం బాగా ఆడకపోయినా అది బుల్లితెరపై ఇప్పటికీ వీక్షకులను కట్టిపడేస్తోంది.

ఇక ఈయన గత చిత్రాలలో కనిపించే మ్యాజిక్‌, ప్రతిభ ఇందులో 0.111పర్సెంట్‌ కూడా లేదు. ఆయన కూడా నేనే సీతయ్యని నేను ఎవరి మాట వినను. ఎవరైనా చెప్పినా మంచి సలహాలు కూడా తీసుకోను అనే స్థితికి వెళ్లిపోయాడని అర్ధమవుతోంది. మరోవైపు పవన్‌ సినిమాలలో కూడా ఈ మధ్య తాను నటించిందే చిత్రం అనే భ్రమలు ఏర్పడ్డాయి. పక్కన చేరే భజన బ్యాచుల ప్రభావం ఈ ఇద్దరి విషయంలోనూ కామన్‌గా కనిపిస్తోంది. ఇక ఈచిత్రంలో ‘మళ్లీ మళ్లీ ఎదురయ్యేది అనుభూతి, ఒక్కసారే జరిగేది అద్భుతం’ అనే డైలాగ్‌ ఉంది. ఈ చిత్రంలో త్రివిక్రమ్‌ అద్భుతం చేయలేదు సరికదా.. కనీసం అనుభూతిని కూడా కలిగించలేకపోయాడు. వివేకంతో తీస్తే అది ‘అత్తారింటికి దారేది’ అవుతుంది. విచక్షణా రహితంగా తీస్తే అది ‘అజ్ఞాతవాసి’ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *