‘భాగమతి’ పై బాహుబలి అభిప్రాయం ఇదే..!

కోలీవుడ్‌లో నయనతారలాగా, బాలీవుడ్‌లో కంగనారనౌత్‌, విద్యాబాలన్‌ తరహాలలోనే మన తెలుగులో స్వీటీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈమె కెరీర్‌లో చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తైతే ‘అరుంధతి’ మరో ఎత్తు. శ్యాంప్రసాద్‌రెడ్డి నిర్మాతగా అంతకు ముందు సౌందర్యతో ‘అమ్మోరు’ ఎలా రూపొందిందో.. అనుష్కతో ఆయన రూపొందించిన ‘అరుంధతి’ కూడా అదే కోవలోకి చెందుతుంది. అప్పటివరకు స్వీటీలో కేవలం గ్లామర్‌ కోణం మాత్రమే అందరికీ తెలుసుగానీ ఆమెలోని నటిని చూసిన వారుగా కోడిరామకృష్ణ, శ్యాంప్రసాద్‌రెడ్డిలకు ఆ క్రెడిట్‌ దక్కుతుంది. ఈ చిత్రం ప్రారంభమైన ఎంతో కాలానికి గానీ విడుదల కాలేదు. ‘అమ్మోరు’ వంటి చిత్రాలను చూసిన వారికి శ్యాంప్రసాద్‌రెడ్డి, కోడిరామకృష్ణలపై నమ్మకం ఉన్నా కూడా ఈ చిత్రం ఎప్పుడు మొదలైంది.. ఎక్కడి వరకు షూటింగ్‌ పూర్తయింది అనేవి ఎవ్వరికి తెలియదు. ఇక గ్రాఫిక్స్‌ వల్ల లేటయిన ఈ చిత్రం విడుదల కూడా వాయిదాల మీద వాయిదాలు పడింది. పోస్టర్స్‌ ప్రింట్‌ చేసిన రెండూ మూడు రోజులకి థియేటర్లలోకి వచ్చింది. 

అలా వాయిదా పడిన చిత్రాలు ఫ్లాప్‌ అవుతాయనే సెంటిమెంట్‌ అందరిలో ఉండేది. దాంతో దానిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ విడుదలైన తర్వాత ఈ చిత్రం సాధించిన సంచలనం, అనుష్కకి వచ్చిన పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం కనివిని ఎరుగని సంచలనాలు క్రియేట్‌ చేసి ఓవర్‌నైట్‌ అనుష్కని స్టార్‌ హీరోయిన్‌ని చేసింది. విజయశాంతి, సౌందర్యల తర్వాత అంతటి క్రేజ్‌ని అనుష్కకి సాధించిపెట్టింది. ఆ తర్వాత అనుష్క చిత్రం అంటే ఆమె పాత్రకి కూడా ఎంతో ఇంపార్టెన్స్‌ ఇవ్వడం మొదలైంది. ఆ తర్వాత ‘రుద్రమదేవి, బాహుబలి’లతో మరోసారి తనని తాను నిరూపించుకుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘భాగమతి’ విషయంలో కూడా ‘అరుంధతి’ తరహాలనే సాగుతోంది. పెద్దగా షూటింగ్‌ సమయంలో ఎవ్వరూ మాట్లాడుకోలేదు. కానీ ఫస్ట్‌లుక్స్‌, టీజర్‌ తర్వాత ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడాయి.

ఇక ఈ చిత్రం ట్రైలర్‌తో పాటు సినిమాని కూడా ప్రభాస్‌ చూసేసి ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమాలో అనుష్క అద్భుతంగా నటించింది. ఆమెకి కష్టపడే తత్వం, అంకిత భావం ఉన్నాయని ప్రశంసిస్తూ, అనుష్కకి, యువిక్రియేషన్స్‌ బేనర్‌కి, దర్శకుడు అశోక్‌కి తన విషెష్‌ తెలిపాడు. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన కెరీర్‌లో కేవలం ‘పిల్లజమీందార్‌’ వంటి హిట్‌ ఉన్న అశోక్‌ మీద నమ్మకంతో ఈ చిత్రానికి నిర్మాతలు బాగా బడ్జెట్‌ని పెట్టారు.. ఇక ఈ నెల 26న విడుదల కానున్నఈ చిత్రం మరో ‘అరుంధతి’ అవుతుందో లేదో చూడాలి….!

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *