భలేవాళ్లే.. ఆ పిసినారా ఎన్టీఆర్ బయోపిక్ తీసేది!

వైసీపీ నేత జగన్‌ అతి విశ్వాసం, నోటి దురుసు, తమ పార్టీ ఎప్పుడైనా సరే గెలుస్తుందనే అహంకారం, పెద్దలను పట్టించుకోడు.. వారి సలహాలను తీసుకోడు… అన్ని తాననుకున్నట్లే చేస్తాడు… పెద్దలకు, వయసుకు కూడా గౌరవం ఇవ్వడు అనే అభిప్రాయం ప్రజలలోనే కాదు.. వైసీపీ నేతలు, కార్యకర్తల్లో కూడా ఉంది. అయితే ఎంతో కాలంగా జగన్‌కి చెందిన మరో వార్త కూడా రాష్ట్రంలో బలంగా వినిపిస్తోంది. జగన్‌ కనీసం టీ ఖర్చులు కూడా తాను పెట్టడని, అన్నికోట్లు అక్రమార్జన చేశాడని కేసులు ఎదుర్కొంటున్న ఆయన డబ్బు విషయంలో మాత్రం మహా పిసినారి అనే విషయం బాగానే చర్చకు వస్తోంది. 

మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా జనాలకు పదిపైసలు డబ్బు ఇవ్వాల్సిన పనిలేదు. నన్ను చూసి గెలిపిస్తారు అనే చెప్పేవాడట. ఇది మంచి పద్దతే.. ఎందుకంటే ఎన్నికల్లో ఓట్లేయడానికి డబ్బులు పంపిణీ అనేది ఎవ్వరూ సమంజసం అని అనరు. అయితే సామాన్యుల మనస్తత్వం మాత్రం మరో విధంగా ఉంటోంది. ఒకసారి ఓటేసిన తర్వాత గెలిచిన వారు తాము సంపాదనలో మునిగితేలుతున్నారు. కేవలం ఎన్నికల నాడే మన వద్దకు వస్తున్నారు. కాబట్టి ఈ ఒక్కసారైనా డబ్బివ్వకపోతే ఎందుకు ఓట్లేయాలి? మనకున్న పనులు, రోజువారి కష్టంతో బతుకు ఈడ్చుకునే వారు ఒకరోజంతా ఓట్లేయడానికి కేటాయిస్తే మా కడుపు ఆ రోజున నిండేదెలా? అనే వాదన కూడా బాగా ఉంది. 

ఇక విషయానికి వస్తే జగన్‌ పదిపైసలు కూడా ఖర్చు చేయడనే విషయాన్ని లక్ష్మీపార్వతి కూడా అంగీకరించింది. ప్రస్తుతం రాంగోపాల్‌వర్మ..  వైసీపీ నేత రాకేష్‌రెడ్డి నిర్మాతగా ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటర్‌ అయిన తర్వాత ఏం జరిగిందే? అనేకోణంలో సినిమా తీయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈచిత్రానికి పెట్టుబడిని జగనే పెడుతున్నాడని పుకార్లు కూడా వస్తున్నాయి. దీనిపై లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, ఎన్నికల్లో కూడా ఈ అబ్బాయ్‌ (జగన్‌) డబ్బులు తీయడు. ఎలక్షన్లకే ఖర్చుపెట్టడు అని మేమే పార్టీలో బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఆ అబ్బాయ్‌ ఎన్టీఆర్‌ కోసమో, లక్ష్మీపార్వతి కోసమే సినిమా తీస్తాడని ఎవరూ అనుకోరు. ఈ విషయాన్ని జగన్‌ మనస్తత్వం తెలిసిన వారు ఎవ్వరూ నమ్మరు. తెలుగుదేశం పార్టీ వారు కూడా అలా అనలేరని చెప్పుకొచ్చింది. 

లక్ష్మీపార్వతి వ్యాఖ్యలతో జగన్‌ డబ్బులు తీయడమే ప్రచారం నిజమేనని అర్ధమవుతోంది…! కాకపోతే తమ పార్టీ నేత కాబట్టి రాకేష్‌రెడ్డి చేత ఈ చిత్ర నిర్మాతగా వర్మని ప్రభావితం చేసే అవకాశమైతే ఉంది. కానీ వర్మ కూడా తాను అనుకున్నది తీస్తాడే గానీ, నిర్మాతల మాటలను పట్టించుకోడు అనేది కూడా వాస్తవమే. మొత్తానికి వర్మ చిత్రం ఇప్పుడు మంచి కాకరేపుతూ వర్మ అనుకున్న పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది. 

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *