దివిసీమలో హై లెస్సో.. హై లెస్సా

నవ్యాంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ గత సంవత్సరం ఈ ప్రాంతంలో సంప్రదాయంగా జరిగే పడవల పోటీలను రాష్ట్ర వేడుకగా గుర్తించింది. రాష్ట్ర స్థాయి పడవల పోటీల్లో భాగంగా ఈ సంవత్సరం సంప్రదాయ కోల పడవలు, కేరళ తరహా డ్రాగన్‌ పడవ పోటీలను నిర్వహిస్తోంది. ఈసారి కొత్తగా భార్యాభర్తలు సంప్రదాయంగా చేసే వేటను ప్రతిబింబిస్తూ సాగే మెడ్డుడు పడవ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. కోల పడవల పోటీలు, మెడ్డుడు పోటీలు, ఇంజన్‌ పడవల పోటీలు… ఇలా మూడు రకాల పడవల పోటీలు ఎంతో అబ్బురంగా, దేనికదే సాటి అన్నట్లుగా సాగాయి.

ఐదుగురు సభ్యులతో ఒక్కొక్క పడవపై నలుగురు తెడ్డు వేయగా, ఒకరు చుక్కానిని పర్యవేక్షిస్తూ కోల పోటీల్లో పాల్గొన్నారు. 500 మీటర్ల గమ్య లక్ష్యంగా ఈ పోటీలు సాగాయి. భార్యతో పయనిస్తూ భర్త తెడ్డు వేస్తూ మెడ్డుడు పోటీలు ఆద్యంతం ఆసక్తిని నెలకొల్పాయి. సంప్రదాయ పడవల పోటీలు నాగాయలంకలో శనివారం సందర్శకుల కోలాహలం మధ్య ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భారీగా సందర్శకులు తరలిరావటంతో కృష్ణా తీరం జనసంద్రాన్ని తలపించింది. పోటీలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి యువకులు ఉత్సాహంగా తరలివచ్చారు. శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌లో రెండు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మొదటి రోజున నిర్వహించిన కోల పడవల పోటీలను వీక్షించేందుకు సభావేదిక, నదీ ప్రాంతంలో ప్రజలు బారులు తీరారు. గతేడాది కన్నా ఈ ఏడాది ముందస్తు ప్రణాళికతో పోటీలు నిర్వహించారు. నిర్వాహకులు మంచినీరు, భోజన వసతులు కూడా ఏర్పాటు చేయటంతో జనం సంతోషం వ్యక్తం చేశారు. నాగాయలంక మండలంలో ప్రారంభించిన జలక్రీడల అకాడమీ ద్వారా దివి ప్రాంతం క్రీడారంగంలో కొత్తపుంతలు తొక్కనుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం నాగాయలంకలో జలక్రీడల అకాడమీ భవనాలకు శాప్‌ ఎండీ బంగార్రాజు, ఇతర అధికారులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. దీంతో రాష్ట్రంలో నాలుగుచోట్ల జలక్రీడల అకాడమీలకు ప్రభుత్వం అంకురార్పణ చేసిందని మంత్రి అన్నారు. దివిసీమకు చెందిన జలక్రీడల క్రీడాకారిణి సీతామహాలక్ష్మిని క్రీడా ప్రాధికారిత సంస్థ తరఫున సన్మానించారు. క్రీడలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొద్ది నెలల్లోనే అకాడమీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని..ప్రభుత్వం ఈ మేరకు రూ.3కోట్ల నిధులను విడుదల చేసిందని చెప్పారు.


Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *