తెలుగుదేశం ఎన్నికల శంఖారావం.తొడగొడుతున్న తెలుగు తమ్ముళ్లు

తెలుగుదేశం కదనోత్సాహంతో కళ్లెం విడిచిన గుర్రంలా పరుగులు పెడుతోంది. ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయా అని సమరోత్సాహంతో సై..సై అంటోంది. ఎన్నికలు కురుక్షేత్రం అయినా రణక్షేత్రమైనా ఎప్పుడైనా సరే సిద్ధం అంటూ తెలుగు తమ్ముళ్లు తొడగొడుతున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించారు.

ఏదో మెజార్టీ స్థానాలు గెలిచామా, అధికారంలోకి వచ్చామా అనేది కాదు ఇప్పుడు టీడీపీ ఎజెండా. రాష్ట్రంలో వైసీపీకి ప్రతిపక్షహోదా దక్కనీయకూడదు అనేది తాజా టార్గెట్‌. అసాధారణ, తిరుగులేని విజయం సాధన కోసం ఇంటింటినీ కలిసి పసుపుదళం పలకరిస్తోంది. నేరుగా ప్రజలను కలవటం వలన వారికి కాస్త అసంతృప్తి తగ్గించినట్టు అవుతుంది, చిన్నచిన్న సమస్యలను పరిష్కరించినట్టు అవుతుంది, ప్రతిపక్షం కంటే ముందు జనం వద్దకు వెళ్లినట్టు అవుతుంది, తాము చేసిన ఎన్నో మంచిపనులను చెప్పుకున్నట్టు అవుతుందని తలపెట్టిన ఈ కార్యక్రమం అద్భుతంగా సాగుతూండటంతో పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తమ విజయానికి ఈ కార్యక్రమం బాటలు వేస్తుందన్న విశ్వాసంలో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మొదట ఈ కార్యక్రమాన్ని 50 రోజులు మాత్రమే నిర్వహించాలని భావించారు. అయితే… దీనిని మరో పది రోజులు పొడిగిస్తూ మంగళవారం నిర్ణయించారు. అంటే… నవంబరు పదో తేదీ వరకూ దీనిని కొనసాగించనున్నారు. ‘‘ఎక్కడైనా జాప్యం అయితే 75 రోజుల వరకూ నిర్వహించాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటిని పార్టీ బృందం సందర్శించి తీరాలి. పెన్షన్లు, రేషన్‌ కార్డులు, పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలవంటి వ్యక్తిగత అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చడంపై ఆయా శాఖలు కసరత్తు మొదలు పెట్టాలి. దానికి అవసరమైన నిధుల సేకరణపై కూడా ప్రణాళిక రచించుకోవాలి’’ అని సీఎం నిర్దేశించారు.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *