టీటీడీలోకి ఒకరు టీడీపీలోకి ఒకరు

నంద్యాల, కాకినాడ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌తో జోష్‌ మీదున్న టీడీపీ జగన్‌కి అతని సొంత ఇలాఖాలో 2019 ఎన్నికల్లో భారీ షాక్‌లు ప్రతి నియోజకవర్గంలో ఇవ్వటానికి నియోజకవర్గానికో వ్యూహం తయారు చేస్తోంది. ఇప్పటికే పులివెందుల ఎమ్మెల్సీగా జగన్‌ బాబాయ్‌ వివేకాను ఓడించి జగన్‌ పరువు తీసిన టీడీపీ కన్ను ఈసారి రాజంపేట‌, మైదుకూరులపై పడింది. మైదుకూరు టీడీపీ అభ్యర్థి, యనమల వియ్యంకుడు సుధాకర్‌ యాదవ్‌కి దాదాపు టీటీడీ ఛైర్మన్ పదవి ఖాయం అయిపోయింది. దాంతో ఆయనను మైదుకూరు అసెంబ్లీ సీటు పోటీ నుంచి తప్పించినట్టే.

మరోపక్క మైదుకూరులో వైఎస్‌ ప్రత్యర్థి, రాయలసీమ రాజకీయాల్లో సుపరిచితుడు డీఎల్‌ రవీంద్రారెడ్డికి ఆ సీటును ఇవ్వాలని టీడీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. డీఎల్‌ కూడా టీడీపీలో చేరాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. నాలుగు సార్లు మంత్రిగా పని చేశారు. డాక్టర్ డీఎల్‌ రవీంద్రాకు అక్కడ గట్టి పట్టుంది. గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది.. ఇప్పటికీ కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో డీఎల్‌ వెంట నడుస్తున్నాయి. కడప జిల్లాలో జగన్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు నియోజకవర్గాల వారీగా స్కెచ్‌లు వేస్తున్నారు టీడీపీ వ్యూహకర్తలు. జగన్‌ ప్రత్యర్థులను గుర్తించి ఈసారి జగన్‌పైకి ఎక్కుపెట్టబోతున్నారు. ప్రత్యర్థిని ఏదో బుగ్గగిల్లి వదిలేయటం కాదు..కొడితే మళ్లీ ఇప్పట్లో లేచి నిలబడకూడదు అన్నంత కసిగా ఈసారి కొట్టాలని అనుకుంటున్నారు కడప తెలుగుదేశం లీడర్లు.

Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *