కేవీపీ vs సూరీడు

జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావుకు ఉచ్చు బిగుసుకుంటన్నట్లుంది. అయితే ఇప్పటివరకు ఈ సంచలనాత్మక కేసులో కేవీపీ పాత్ర ఎంతమేరకు అన్నది స్పష్టం కాలేదన్నది సుస్పష్టం. కానీ, వైఎస్ నీడ సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ (సూరీడు) ఈ కేసులో కీలక సాక్షి అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా సూరీడు వైఎస్ హయాంలో చోటు చేసుకున్న పలు అవినీతి భాగోతాలపై నోరు విప్పినట్టు సమాచారం. సీబీఐ చేతిలో ఉన్న ఆ వివరాలు కేవీపీని నిందితుడిగా నిలబెట్టేందుకు సరిపోతాయని తెలుస్తోంది. ఇంతకీ సూరీడు చెప్పిన నిప్పులాంటి నిజాలేంటంటే.. వైఎస్ ను కలిసేందుకు ఎవరొచ్చినా ముందు కేవీపీ వద్ద అపాయింట్ మెంట్ తీసుకోవాలట. కేవీపీ వద్ద స్క్రీనింగ్ టెస్టు పాసయితేనే వైఎస్ తో భేటీ సాధ్యమయ్యేది.

దానర్థం, సదరు వ్యక్తి ఏమైనా ఉపయోగపడతాడా లేదా అనేది కేవీపీ చూసుకునేవాడని తెలుస్తోంది. ఆ వ్యక్తి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని తెలిస్తే ఇక అతనికేమి కావాలో వైఎస్ చూసుకునేవాడు. ఎంతటి భారీ ఒప్పందంలోనైనా ఇదే తంతు. వైఎస్ ను నేరుగా కలిసేందుకు ప్రయత్నించినా ఆయన సైతం కేవీపీని దర్శించుకోమనే సూచించేవారట. ‘ఆత్మ’ ఎంతలా వైఎస్ ను ఆవహించిందో అర్థం అవుతోంది. అక్రమాస్తుల కేసులో ఓ వైపు జ‌గ‌న్ విచార‌ణ ఎదుర్కొంటున్న సంద‌ర్భంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆత్మగా చెప్పుకున్న కేవీపీ రామ‌చంద్రరావు మాత్రం ఈ కేసుతో సంబంధం లేకుండా త‌ప్పించుకున్న వ్యవ‌హారం మీద ‘సూరీడుకి కోపం వ‌చ్చింది’..! గ‌తంలో ఈ కేసుల‌కు సంబంధించి సీబీఐ విచార‌ణ‌కు కేవీపీ హాజ‌ర‌య్యారే త‌ప్ప, ఎలాంటి అభియోగాలు ఎదుర్కోవ‌డం లేదు. అయితే వైఎస్‌కు కుడిభుజంగా, అత్యంత స‌న్నిహితుడిగా వున్న సూరీడు ఈ వ్యవ‌హారంలో మ‌రోసారి సీబీఐని ఆశ్రయించాల‌నుకుంటున్నట్టు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే ఈ కేసుల మీద రివ్యూ పిటిష‌న్ వేయాల‌ని కూడా సూరీడు ఆలోచిస్తున్నట్టు స‌మాచారం. వేల కోట్ల రూపాయ‌ల లావాదేవీల‌కు సంబంధించిన ఈ త‌తంగం అంతా కేవీపీ పాత్ర లేకుండా జ‌రిగే ఆస్కార‌మే లేద‌ని, ఆయ‌న్ని కూడా ఈ కేసుల్లో దోషిగా చేర్చిన‌ప్పుడే పూర్తి విచార‌ణ జ‌రిగిన‌ట్టు అవుతుంది అన్నది సూరీడు వాద‌న‌. రివ్యూ పిటిష‌న్ ఎలా ఉండాలి? ఎలా వేయాలి? అన్న అంశం మీద ఇప్పటికే న్యాయ నిపుణుల స‌ల‌హాలు కూడా సూరీడు తీసుకుంటున్నాడన్నది ఆయన స‌న్నిహితుల నుంచి అందుతున్న స‌మాచారం.


Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *