కిరణ్‌కి టచ్‌లో అమర్‌నాథ్‌రెడ్డి ఏం జరుగుతోంది?

కిర‌ణ్‌కుమార్ రెడ్డిని కూడా టీడీపీలోకి తీసుకు వ‌చ్చే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా మంత్రి, ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే అమ‌ర్‌నాథ్‌రెడ్డి స్వయంగా తానే కిర‌ణ్‌కి టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. ఎలాగైనా ఒప్పించి టీడీపీలోకి తీసుకు వ‌చ్చేందుకు ఆయ‌న‌తో రెండుమూడు సార్లు భేటీ అయిన‌ట్టు తెలుస్తోంది. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పొలిటిక‌ల్ రీ ఎంట్రి ఇస్తార‌ని కొద్ది రోజులుగా వార్తలు వ‌స్తున్నాయి. ఆయ‌న రీ ఎంట్రీ జ‌న‌సేన‌తో ఉంటుద‌ని, వైసీపీలోకి వెళ‌తార‌ని, కాదు కాదు తిరిగి కాంగ్రెస్‌లోకే వెళ‌తార‌ని కొద్ది రోజులుగా వార్తలు వ‌స్తున్నాయి. తాజాగా మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి కిర‌ణ్‌ను క‌లిసి టీడీపీలోకి ఆహ్వానించిన‌ట్టు తెలిసింది. మీరు టీడీపీలో చేరితే బాగుంటుందని…మీకు పార్టీలో గౌరవప్రదమైన స్థానం ఉంటుందని అమర్‌నాథ్‌రెడ్డి సూచించినట్టు తెలిసింది.

ఈ ఆహ్వానంపై చూద్దాం అని దాట‌వేత ధోర‌ణితో ఉన్న కిర‌ణ్ తాను వైసీపీలోకి మాత్రం వెళ్లేది లేద‌ని కుండ‌బ‌ద్దలు కొట్టేశార‌ట‌. దీంతో కిర‌ణ్‌కు ఇప్పుడు అయితే టీడీపీ లేక‌పోతే బీజేపీ మాత్రమే ఆప్షన్‌గా క‌నిపిస్తోంది. ఏపీలో బీజేపీకి ఫ్యూచ‌ర్ లేద‌న్న విష‌యం కిరణ్‌కు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో కిర‌ణ్ టీడీపీలో చేరే ఛాన్సులే ఎక్కువుగా ఉన్నాయ‌ని చిత్తూరు జిల్లాలో జోరుగా చ‌ర్చలు న‌డుస్తున్నాయి. మొదటినుంచి కిరణ్‌కు.. చంద్రబాబుకు రాజకీయంగా వైరమే నడిచింది. ఇక పాత విష‌యాలు ఎలా ఉన్నా చంద్ర‌బాబు కూడా ఇప్పుడు కిర‌ణ్‌ను మాజీ సీఎంగా గౌర‌విస్తున్నారు. ఆయ‌న చేసిన కొన్ని ప‌నుల‌ను బాబు మెచ్చుకుంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న సోద‌రుడు పార్టీలో చేరిన సంద‌ర్భంగా సమైక్యాంధ్ర కోసం కిరణ్‌ బాగా ప్రయత్నం చేశారనీ.. అధిష్టానాన్ని సైతం ఎదిరించారనీ కొనియాడారు. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌లు సమీపిస్తోన్న వేళ కిర‌ణ్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీ టీడీపీతోనే ఉంటుద‌న్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.


Source From: Andhra Vijayam

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *