ఈ నటి నిజమైన ప్రతిభావంతురాలు!

పాత చిత్రాలను చూసే వారికి నటి రోజారమణి బాగా గుర్తుంటుంది. ఇక ముఖ్యంగా ఆమె ‘భక్తప్రహ్లాద’ చిత్రంలో పోషించిన టైటిల్‌ పాత్రకి మంత్రముగ్దులు కానివారు ఉండరు. అందులో ఆమె మీదకి దాదాపు పది ఏనుగులు వస్తుంటే ఓ ఏనుగు ఆ బాలనటి మీద కాళ్లు వేయడానికి ప్రయత్నించే సీన్‌ని ఆమె ఎంతోధైర్యంగా చేసింది. శరీరం నిండా నిజమైన పాములతో నటించి మెప్పించింది. ఆతర్వాత ఆమె బాలనటిగా బాగా బిజీ అయింది. కానీ 12,13 ఏళ్ల వయసుకి వచ్చేసరికి అటు హీరోయిన్‌గా, ఇటు బాలనటిగా రెండింటికి సరిపోని వయసులో ఆమె ఉన్నప్పుడు ఓ మలయాళం చిత్రంలో ఏమాత్రం మేకప్‌లేకుండా పనిచేసే పనిపిల్ల పాత్ర వచ్చింది. దాంతో ఆ చిత్రం ఒప్పుకుంది. 

ఈ చిత్రం షూటింగ్‌ని 25 రోజుల్లో పూర్తి చేశారు. ఆమె మహా అయితే ఆ చిత్రం రెండు రోజులు ఆడుతుందని భావించింది. కానీ ఆచిత్రం మలయాళంలో సంచలన విజయం సాధించి, కొత్తట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. అదే చిత్రం తెలుగులో ‘కన్నెవయసు’గా వచ్చింది. దీంతో ఆమె వరుసగా మలయాళంలో 40 చిత్రాల దాకా నటించింది. ఇక ఈమెకి నటన తర్వాత డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా గొప్ప పేరు వచ్చింది. దాదాపు 500ల చిత్రాలకు, 400మంది హీరోయిన్స్‌కి ఈమె డబ్బింగ్‌ చెప్పింది. ఈమె ఒరియా చిత్రం చేస్తున్న సమయంలో చక్రపాణితో పరిచయం అయింది. ఇంట్లో పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. కానీ ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌ అన్ని పూర్తయిన తర్వాతే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బాబు పుట్టాడు. బాబుకి రెండున్నర ఏళ్ల వయసు వచ్చే దాకా మరలా సినిమాల వైపు పోకుండా తన తల్లి బాధ్యతను నెరవేర్చింది. 

ఆ సమయంలో ఆమెకి సుహాసినికి డబ్బింగ్‌ చెప్పే అవకాశం వచ్చింది. దాంతో సుహాసినికి వరుసగా 20 చిత్రాల వరకు తానే గాత్రం అందించింది. నాడు సుహాసిని పెద్ద స్టార్‌ కావడంలో ఈమె పాత్ర కూడా ఎంతో కీలకం. ఇక ఆమె మాట్లాడుతూ, మీనాకి పాతకాలంలో బి.సరోజాదేవికి చెప్పినట్లుగా చిలకపలుకులతో డబ్బింగ్‌ చెప్పాలి. రమ్యకృష్ణకి బోల్డ్‌గా, రాధకి హైపర్‌లో డబ్బింగ్‌ చెప్పాల్సి వుండటంతో ఆ వైవిధ్యం చూపుతూ 20ఏళ్లుగా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాను. ఇక నేను డబ్బింగ్‌ చెప్పిన పాత్రల్లో ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంలో మీనా పాత్ర, ‘అంకురం’లో రేవతి పాత్ర, ‘నిరీక్షణ’లో అర్చన పాత్ర, ‘ఊర్మిళ’లో మాలాశ్రీకి, ‘కంటే కూతుర్నే కను’ చిత్రంలో రమ్యకృష్ణ పాత్రలకి డబ్బింగ్‌ చెప్పడం మర్చిపోలేను. ఆ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఎంతో ఉద్వేగం చెందాను… అని చెప్పుకొచ్చింది. 

Source From: http://www.cinejosh.com/rss-feed/0/telugu.html

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *